: ప్రొద్దుటూరు జడ్జి ముందుకు గంగిరెడ్డి... 14 రోజుల రిమాండ్ కు ఎర్ర'డాన్'!
ఏడాదిన్నరకు పైగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఎట్టకేలకు మళ్లీ జైల్లోకి చేరాడు. ఇటీవల మారిషస్ పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, నెలల తరబడి అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన ఏపీ సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అతడిని నిన్న హైదరాబాదుకు తీసుకువచ్చారు. నిన్న రాత్రే హైదరాబాదు నుంచి కడపకు తరలించిన పోలీసులు, అక్కడి రిమ్స్ ఆసుపత్రిలో అతనికి వైద్య పరీక్షలు చేయించిన పిదప, ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో ఎర్రడాన్ గంగిరెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. వెంటనే, అతడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.