: అటవీ ప్రాంతాలు దైవ భూమితో సమానం: శారదా పీఠాధిపతి
అటవీ ప్రాంతాలు దైవ భూమితో సమానమని, ప్రకృతి ప్రసాదించిన వరాల్లో బాక్సైట్ నిక్షేపాలు కూడా ఉన్నాయని శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి అభిప్రాయపడ్డారు. బాక్సైట్ నిక్షేపాలను కొల్లగొట్టే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన సూచించారు. అవసరమైతే గిరిజనులకు మద్దతుగా తాను పోరాడతానని అన్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు సరైన ఆహ్వానం అందకపోవడం వల్లే ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయారా? అన్న ప్రశ్నపై ఆయన మాట్లాడుతూ, ‘రాజధాని ప్రభుత్వం సొత్తా, ఏమిటీ?' అని ఆయన ప్రశ్నించారు. "నాలుగేళ్లు, ఐదేళ్లుండే ప్రభుత్వాలు నన్ను పిలిచేదేమిటి, నేను అక్కడికి వెళ్లేదేమిటి? హిందువులను అణగదొక్కేందుకు చేస్తున్న కుట్రను మేము బయటపెడుతుంటే... దానిని విమర్శలుగా పేర్కొనడం కరెక్టు కాదు" అని స్వరూపానంద అన్నారు.