: నాథూరాం గాడ్సే పేరిట వెబ్ సైట్ ప్రారంభం
జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే పేరిట 'నాథురాం గాడ్సే- ఏ ఫర్గాటెన్ హీరో' అనే వెబ్ సైట్ ను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా గాడ్సేను ఉరి తీసిన రోజు నవంబరు 15ను బలిదాన్ దివస్ గా అఖిల భారతీయ హిందూ మహాసభ జరుపుకుంది. ఈ వెబ్ సైట్ లో గాడ్సేకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఇందులో గాడ్సే, అతని సోదరుల రచనలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గాడ్సే పేరిట హిందూ మహా సభ కార్యాలయాల్లో యాగాలను నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ మున్నాకుమార్ మాట్లాడుతూ, ‘దేశ విభజనకు గాంధీ కారణమయ్యాడనే కారణంతో గాడ్సే ఈ హత్యకు పాల్పడ్డాడు. గాంధీ బ్రతికుంటే భవిష్యత్తులో దేశం ఇంకా ముక్కలవుతుందని గాడ్సే గ్రహించాడు’ అన్నారు. గాడ్సే జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలన్న డిమాండ్ తో రాష్ట్రపతికి త్వరలో వినతిపత్రం సమర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.