: చిరంజీవి, పవన్ లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కాపు ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తోంది!: ముద్రగడ పద్మనాభం
చిరంజీవి, పవన్ కల్యాణ్ లని అడ్డు పెట్టుకుని కాపు ఉద్యమాన్ని ఏపీ సర్కార్ పక్కదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాకినాడలో ఆదివారం కాపు ఐక్య గర్జన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనవరి 31వ తేదీన తునిలో కాపు ఐక్య గర్జన మహా సభను నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ హామీని ఆయన నిలబెట్టుకోనందుకే కాపులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. కాపుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెప్పిన బాబు కాలయాపన చేస్తున్నారన్నారు. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఆయన ఇప్పుడు వారిని మోసగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు కులస్తులకు రిజర్వేషన్ ఫలితాలు దక్కాలనే ఉద్దేశ్యంతోనే ఐక్య గర్జన నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని ముద్రగడ అన్నారు.