: ప్రముఖ తమిళ దర్శకుడు గోపాలకృష్ణన్ మృతి
ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నిర్మాత కెఎస్ గోపాలకృష్ణన్ (86) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు. పలు సామాజిక, భక్తి రస చిత్రాలను గోపాల కృష్ణన్ రూపొందించారు. తమిళ లెజెండరీ నటులు జెమినీ గణేశన్, శివాజీ గణేశన్, కేఆర్ విజయ, జయలలిత వంటి పలువురు నటులతో ఆయన చిత్రాలను నిర్మించారు. గోపాలకృష్ణన్ కేవలం దర్శకుడు, ప్రొడ్యూసర్ గానే కాకుండా పాటల రచయితగా, మాటల రచయితగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన కలం నుంచి పలు సూపర్ హిట్ పాటలు జాలువారాయి. ఉత్తమ పుతిరన్ చిత్రంలోని ‘ఉన్నాఝాగాయి కన్నియార్గాలా’ నాటి సూపర్ హిట్ పాటను ఎవ్వరూ మర్చిపోలేరు. ‘అమరదీపం’,‘పడిక్కాదా పన్నయ్యర్’ వంటి చిత్రాలకు గీత రచయితగా, ‘పదిక్కాదా మెధాయి’, ‘అన్నయ్’, ‘పర్ సొల్లుమ్ అన్నయ్’ వంటి చిత్రాలకు మాటల రచయితగా, ‘పెసుమ్ దైవమ్’, ‘చిట్టి’, ‘పనామా పసామా’,‘కురాథి మాగన్’ వంటి పలు చిత్రాలకు ఆయన దర్శకుడిగా వ్యవహరించారు. కాగా, ఈరోజు ఆయన అంత్యక్రియలు జరిగాయి. గోపాలకృష్ణన్ కు ఆరుగురు కుమారులు ఉన్నారు.