: పవన్ కల్యాణ్...! సినిమాల్లో ఉంటావా? లేక రాజకీయాలు చేసుకుంటావా?: ప్రముఖ జర్నలిస్టు తెలకపల్లి రవి


‘పవన్ కల్యాణ్... సినిమాల్లో ఉంటావా? లేక రాజకీయాలు చేసుకుంటావా? ఏదో ఒకటి తేల్చుకో’ అంటూ ప్రముఖ జర్నలిస్టు, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు తెలకపల్లి రవి హితవు పలికారు. ఒంగోలులో విలేకరులతో మాట్లాడిన ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ‘చూడప్ప సిద్దప్పా, ఉంటే రాజకీయాల్లో ఉండు, లేకపోతే సినిమాలు చేసుకో’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఆయన సూచించారు. పవన్ కల్యాణ్ ఎవరి తరపున ప్రశ్నిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు చెప్పిన సమాధానాలనే ప్రజలకు చెప్పడం వలన ఉపయోగమేమిలేదన్నారు. చంద్రబాబుకు గెస్ట్ గా ఉండకూడదని, గెస్ట్ ఆర్టిస్టులా ఎప్పుడన్నా ఒకసారి ప్రజలకు కన్పించి ఏవో నాలుగు డైలాగులు చెప్పటం వలన ప్రయోజనమేమిటంటూ ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ లేదు, ఇవ్వకపోతే చూద్దాం అంటున్న పవన్ కల్యాణ్ కాలాన్ని వృథా చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు తాను రాయలసీమ బిడ్డనని పదేపదే చెప్పుకోవడం వల్ల ఉపయోగమేమిటని రవి ప్రశ్నించారు. త్వరలో కట్టబోయే అమరావతి రాజధాని స్టేట్ స్పాన్సర్డ్ సింగపూర్ వెంచరని ఆరోపించారు. బీహార్ లో బీజేపీ ఓటమి, కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలపై వివాదం...వంటి అంశాలపై ఆయన మాట్లాడారు.

  • Loading...

More Telugu News