: రెండు వారాల్లో ఇండియా నుంచి రూ. 2,800 కోట్లు ఎత్తుకెళ్లిన విదేశీ ఇన్వెస్టర్లు!
భారత స్టాక్ మార్కెట్ నుంచి లాభాలను వెనక్కు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు గడచిన రెండు వారాల్లో రూ. 2,800 కోట్లకు విలువైన ఈక్విటీలను విక్రయించారు. బీఎస్ఈలో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, ఎఫ్‌పీఐ (ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్)లు నవంబర్ 2 నుంచి 13 మధ్య రూ. 2,505 కోట్ల విలువైన డిపాజిటరీస్, రూ. 313 కోట్ల విలువైన డెట్ స్కీముల నుంచి వైదొలిగారు. అంతకుముందు అక్టోబరులో మొత్తం రూ. 22,350 కోట్లను పెట్టుబడిగా పెట్టిన ఎఫ్‌పీఐలు ఇప్పుడు భారీగా విక్రయాలు జరుపుతుండటంతో మార్కెట్ల గమనంపై కాస్తంత ఆందోళన నెలకొంది. ఇక డిసెంబర్ లో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్న నేపథ్యంలో మార్కెట్లలో మరింతగా అమ్మకాలు సాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్లూచిప్ కంపెనీల అసంతృప్తికర ఆర్థిక ఫలితాలు కూడా విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయని హెచ్‌ఈఎం సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్లు 'బేర్'ల నియంత్రణలో ఉన్నట్టు భావించవచ్చని తెలిపారు.