: తరుముకొస్తున్న మరో వాయు'గండం'!
బంగాళాఖాతంలో చెన్నైకి నైరుతిలో ఏర్పడిన అల్పపీడనం, ఈ సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారి విరుచుకుపడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురవవచ్చని అధికారులు వెల్లడించారు. దీంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారుల సెలవులను రద్దు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. చేపల వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించిన జానకి, కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్లలో కాల్ సెంటర్లను తక్షణం ప్రారంభించాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బోట్లను సిద్ధం చేయించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వారందరినీ సాయంత్రానికి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు తెలిపారు.