: ఆదిలోనే విఫలమైన మోదీ సరికొత్త ఆలోచన!
దాదాపు 10 రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించిన గోల్డ్ మానిటైజేషన్ (బంగారం నగదీకరణ, పెట్టుబడి పథకాలు) స్కీమ్ కు ప్రజల నుంచి ఆశించినంత స్పందన రాలేదని తెలుస్తోంది. ఇండియాలో ప్రజల వద్ద, పలు దేవాలయాల్లో ఉపయోగంలో లేని 22 వేల టన్నుల బంగారాన్ని దేశాభివృద్ధికి వినియోగించాలన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఈ స్కీములను ప్రకటించగా, బ్యాంకుల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం, ఇంకా పలు సందేహాలకు ప్రభుత్వం నుంచి స్పష్టత వెలువడకపోవడం కూడా ఇందుకు కారణాలని తెలుస్తోంది. ఈ స్కీములపై నెలకొన్న ప్రశ్నలను రిజర్వ్ బ్యాంకుకు పంపించామని, ఆర్బీఐ నుంచి వెలువడాల్సిన సర్క్యులర్ కోసం ఎదురుచూస్తున్నామని ఓ బ్యాంకర్ వ్యాఖ్యానించారు. టెస్టింగ్, రిఫైనింగ్ ఖర్చులను బ్యాంకులకు ఏ విధంలో రీఎంబర్స్ చేస్తారన్న విషయంలో ప్రభుత్వం స్పందించాల్సి వుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ అధికారి అన్నారు. టెస్టింగ్, మెల్టింగ్, రిఫైనింగ్ ఖర్చులను బ్యాంకులు భరించలేవని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా, తమ బంగారాన్ని బ్యాంకులు కరిగించుకుంటాయన్న వాస్తవం ప్రజలను ఈ స్కీమునకు దూరంగా ఉంచినట్టు నిపుణులు వ్యాఖ్యానించారు. వాడకుండా మూలన పడివున్నప్పటికీ, బంగారంపై గృహిణులు ఎంతో సెంటిమెంటుతో ఉంటారని, ఆ ఆభరణాలను చూసుకుని మురిసిపోయే అతివలు, వాటిని కరిగించి వడ్డీ ఇస్తామంటే, పెద్దగా ఆసక్తిని చూపకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ స్కీమును నవంబర్ 5న ప్రారంభించగా, పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఇప్పటికీ బంగారం డిపాజిట్లను స్వీకరించడం లేదని తెలుస్తోంది. ఈ స్కీము నిబంధనలు మార్చినట్లయితే కొంత మేరకు విజయం సాధించవచ్చన్నది బులియన్ పండితుల అంచనా.