: బులెట్లు అయిపోబట్టే బతికిపోయానంటూ... భయానక అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకున్న విలేకరి!
చుట్టూ ఉగ్రవాదులు. వాళ్ల చేతుల్లోని ఏకే-47 తుపాకులు మాత్రమే మాట్లాడుతున్న వేళ... ప్రాణాలను కాపాడుకునేందుకు జులియన్ పియర్స్ అనే విలేకరి తనకు ఎదురైన భయానక అనుభవాన్ని యూరప్ వన్ రేడియోకు వెల్లడించాడు. ఆ సమయంలో తనకేం చేయాలో తోచలేదని, ఎటువైపున ఉగ్రవాదులు ఉన్నారో కూడా తొలుత తెలియలేదని చెప్పుకొచ్చాడు. "విధి నిర్వహణలో భాగంగా బతక్లాన్ కల్చరల్ సెంటర్ వేదికపై ఉన్నాను. చుట్టూ కాల్పుల శబ్దం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బతుకుతానన్న నమ్మకం లేదు. ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే, సమీపంలో కాల్పులు జరుపుతున్న ఓ ఉగ్రవాది చేతిలోని తుపాకిలో గుండ్లు అయిపోయాయి. అతను బులెట్లు నింపుకుంటున్న వేళ స్టేజీపై నుంచి దూకి బయటకు పరుగుతీశాను. ఇంకా బతకాలని రాసుండబట్టే ప్రాణాలు దక్కాయి" అని వివరించాడు. కాగా, ఫ్రాన్స్ పై జరిపిన ఉగ్రదాడిలో 128 మంది మరణించిన సంగతి తెలిసిందే.