: హైదరాబాదీలూ! బీ కేర్ ఫుల్!: వాతావరణ పరిశోధకులు
హైదరాబాదులో చిత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రతలు హైదరాబాదులో కనిపించడం వాతావరణ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పగటి పూట మధ్యాహ్నం 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా, తెల్లవారుజామున 4 గంటల సమయంలో కేవలం 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. సాధారణంగా 30 డిగ్రీల సెంటీ గ్రేడ్ అంటే చలి పెద్దగా ఉండదు. అలాగే ఉదయాన్నే 16 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే సాయంత్రానికే చలి వణికించాలి. హైదరాబాదును వణికించే చలి ఇంకా మొదలు కాలేదు. అదే సమయంలో మండించే ఎండలు కూడా లేవు. కానీ పగలు ఒకలా, రాత్రి ఇంకోలా ఉన్న వాతావరణ పరిస్థితులు పరిశోధకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఇంత పెద్ద మార్పులు లేవని, సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి నాలుగు సెంటీగ్రేడ్ ల వ్యత్యాసం ఉంటోందని వారు తెలిపారు. ఇంత పెద్ద తేడా ఎందుకు వస్తోందని వారు పరిశోధనల్లో మునిగిపోయారు. ఇదే సమయంలో ఇన్ ఫ్లుయెంజా వైరస్ బలపడే ప్రమాదం ఉందని, హైదరాబాదీలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.