: టీడీపీలో అందరూ కుటుంబ సభ్యుల్లా మెలగాలి: చంద్రబాబు
తిరుపతిలో రెండో రోజు జరుగుతున్న టీడీపీ దిశా-నిర్దేశ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. టీడీపీలో అందరూ కుటుంబ సభ్యుల్లా ఉండాలని చెప్పారు. నేతల మధ్య ఎలాంటి భేషజాలు లేకుండా చూడాలని సూచించారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తల మనోభావాలను గుర్తించాలని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీల అమలుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆదేశించారు. దేశంలో ఏ పార్టీకి లేనంత పటిష్టమైన వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి ఉందని, 54 లక్షల మంది సభ్యులు ఉన్న పార్టీ టీడీపీ అని గుర్తు చేసుకున్నారు. ఎవరైనా సభ్యులు చనిపోతే రూ.2 లక్షల బీమా సదుపాయాన్ని తమ పార్టీ ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. పార్టీలో అన్ని స్ధాయులలో కమిటీలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు చేయాలంటే కమిటీలు సమర్థంగా ఉండాలని పేర్కొన్నారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుని కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. పటిష్ఠమైన యంత్రాంగమే టీడీపీ బలం అన్న సీఎం, ఈ ఏడాది 40వేల మందికి నాయకత్వ శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు.