: ఈసారి విశాఖ వాసులకు మర్చిపోలేని అనుభూతిని ఇస్తాం: నౌకాదళాధిపతి
ఫిబ్రవరిలో విశాఖపట్టణంలో నిర్వహించనున్న నౌకాదళ విన్యాసాల్లో 50 యుద్ధనౌకలతో పూర్తి స్థాయి విన్యాసాలు ప్రదర్శించనున్నామని నౌకాదళ ప్రధానాధికారి ఆర్.కే.ధావన్ తెలిపారు. విశాఖపట్టణంలో నౌకల డిజైనింగ్, వివిధ విభాగాల్లో శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఐఎన్ఎస్ విశ్వకర్మ శిక్షణా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ నౌకావిన్యాసాల్లో భారత నావికాదళ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తామని అన్నారు. భారత నౌకాదళానికి చెందిన అన్ని ప్రధాన యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటాయని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల కోసం నావికాదళం సన్నద్ధమవుతోందని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు జరగనున్న ఈ విన్యాసాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు పాల్గొననున్నారని ఆయన చెప్పారు. ఈ సారి యుద్ధవిన్యాసాలు విశాఖ వాసులకు అద్భుత అనుభూతిగా మిగులుతాయని ఆయన తెలిపారు. విశాఖలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న అణు జలాంతర్గామి 'అరిహంత్'కు జలపరీక్షలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.