: జూలు విదిల్చిన స్పిన్నర్లు...214 పరుగులకు తోకముడిచిన సఫారీలు


టీట్వంటీ, వన్డే సిరీస్ లను గెలుచుకున్న సఫారీలకు స్పిన్ పిచ్ లు పరీక్ష పెడుతున్నాయి. తొలి టెస్టులో గడ్డు పరిస్థితిని ఎదుర్కొని చతికిలపడ్డ సౌతాఫ్రికా జట్టుకు బెంగళూరు చిన్న స్వామి స్టేడియం కూడా కలిసి వచ్చినట్టు కనబడడం లేదు. బ్యాటింగ్ పిచ్ గా పేరొందిన ఈ స్టేడియం కూడా స్పిన్ కు దాసోహమంది. దీంతో సఫారీలు తొలి ఇన్నింగ్స్ లో ఊహించినంత గొప్పగా ఆడలేకపోయారు. టెస్టుల్లో తిరుగులేని ఆటగాడిగా పేరుగాంచిన ఆమ్లా కూడా తడబడ్డాడు. ఓపెనర్లు వాన్ జిల్ (10), ఎల్గర్ (38)లు అశ్విన్, జడేజాల ఉచ్చు నుంచి తప్పించుకోలేకపోయారు. డుప్లెసిస్ (0)ని అశ్విన్ బోల్తా కొట్టించగా, ఆమ్లా (7)ను వరున్ ఆరోణ్ పెవిలియన్ కు పంపాడు. అనంతరం డుమినిని (15) అశ్విన్ అవుట్ చేశాడు. అద్భుతమైన బంతితో మాయ చేసిన జడేజా, విలాస్ (15)ను పెవిలియన్ కు పంపాడు. అనంతరం క్రీజులో కుదురుకున్న డివిలియర్స్ (85)ను బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే రబడా (0)ను అవుట్ చేశాడు. అనంతరం వచ్చిన మోర్కెల్ (22) కాస్త రాణించాడు. చివరి వికెట్ గా అబాట్ (14) పెవిలియన్ చేరాడు. దీంతో 59 ఓవర్లు ఆడిన సఫారీలు తొలి ఇన్నింగ్స్ లో 214 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా నాలుగేసి వికెట్లు తీయగా, ఆరోన్ ఒక వికెట్ తో సహకరించాడు. కాసేపట్లో భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News