: ‘బ్రూస్ లీ’ చిత్రంలో ‘వడ్డీ దందా’ మోహన్ రెడ్డి డబ్బు... రూ.40 లక్షలు పెట్టినట్లు సీఐడీ నిర్ధారణ
పోలీసుగా విధులు నిర్వహిస్తూ వడ్డీ దందా నడుపుతూ పట్టుబడ్డ కరీంనగర్ జిల్లా ఏఎస్సై మోహన్ రెడ్డి ఉదంతంలో సీఐడీ అధికారులు సరికొత్త విషయాలను వెలికి తీస్తున్నారు. కరీంనగర్ లో తనకు పరిచయం ఉన్న పలువురికి అప్పులిచ్చిన మోహన్ రెడ్డి రాజకీయ నేతలకు సైతం భారీ రుణాలిచ్చి ముక్కు పిండి మరీ వడ్డీ వసూలు చేశాడు. అతడి వడ్డీ దందా ఒక్క కరీంనగర్ జిల్లాకే పరిమితం కాలేదు. భాగ్యనగరి హైదరాబాదుకు కూడా విస్తరించింది. టాలీవుడ్ లోని పలువురు నిర్మాతలకు అతడు పెద్ద ఎత్తున రుణాలిచ్చినట్లు సీఐడీ పోలీసులు నిర్ధారించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం ‘బ్రూస్ లీ’ చిత్ర నిర్మాణానికీ మోహన్ రెడ్డి రూ.40 లక్షల మేర సర్దుబాటు చేశాడట. ఈ మేరకు సీఐడీ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మరి ఈ నిధులను మోహన్ రెడ్డే స్వయంగా పెట్టుబడి పెట్టాడా? లేక నిర్మాతలకు అప్పుగా ఇచ్చాడా? అన్న విషయాన్ని తేల్చేందుకు సీఐడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.