: ప్యారిస్ టూర్ లో రేణు దేశాయ్... దాడులకు ముందే టూర్ ముగించుకున్న వైనం
టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య, దర్శకురాలు రేణు దేశాయ్ ఉగ్రవాదుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఫ్రాన్స్ టూర్ కు వెళ్లిన రేణు దేశాయ్, నిన్న రాత్రి ఉగ్రవాదులు ప్యారిస్ లో దాడి జరిపిన ప్రదేశంలోనే బస చేశారు. దాడులు జరగడానికి ముందే ఆమె ప్యారిస్ పర్యటనను ముగించుకుని స్వదేశం బయలుదేరారు. నిన్న రాత్రి ప్యారిస్ నుంచి బయలుదేరిన ఆమె నేటి ఉదయం ముంబై విమానాశ్రయంలో దిగారు. రేణు దేశాయ్ విమానాశ్రయం చేరుకున్న తర్వాత ప్యారిస్ లో దాడుల వార్తలు తెలిశాయి. దీనిపై ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ ‘‘ఇప్పుడే ప్యారిస్ నుంచి ముంబైలో దిగాను. దిగగానే ప్యారిస్ పై ఉగ్రవాదుల దాడుల విషయం తెలిసింది. నా క్షేమం కోసం సందేశాలు పంపిన వారికి కృతజ్ఞతలు’’ అని పోస్ట్ చేశారు.