: బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ నేతగా తేజస్వీ యాదవ్... లాలూ ప్రకటనే తరువాయి


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) 80 సీట్లను గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార జేడీయూ, కాంగ్రెస్ పార్టీలతో జట్టు కట్టి మహా కూటమి పేరిట బరిలోకి దిగిన లాలూ ఎన్నికల ప్రచారంలో అందరికంటే ఎక్కువగా కష్ట పడ్డారు. ఐదు దశలుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా లాలూ ఒక్కరే 250 మీటింగుల్లో పాలుపంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై నిప్పులు చెరిగారు. తన ఇద్దరు పుత్ర రత్నాలు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ల చేత రాజకీయ తెరంగేట్రం చేయించిన లాలూ ఇద్దరికీ విజయాన్ని సాధించిపెట్టారు. ఇక వారిద్దరిని కేబినెట్ లో చేర్పించడమే లక్ష్యంగా లాలూ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తన సొంత నిర్ణయాలను తనవిగా కాకుండా పార్టీ సీనియర్లు తీసుకున్న తీర్మానాలని చెబుతూ లాలూ తన కొడుకులను ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తొలి అడుగేశారు. తన కుమారుడు తేజస్వీ యాదవ్ ను అసెంబ్లీలో పార్టీ నేతగా ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీలో పార్టీ నేత ఎంపిక విషయాన్ని తనకే కట్టబెట్టారని నిన్న సాయంత్రం ప్రకటించిన లాలూ, తాను మాత్రం సీనియర్లను సంప్రదించి తుది నిర్ణయం వెల్లడిస్తానని పేర్కొన్నారు. అయితే తేజస్వీ యాదవే అసెంబ్లీలో పార్టీ నేతగా ఎన్నిక కానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News