: ఆ 10 నిమిషాలు అత్యంత భయంకరం: ఐఎస్ దాడి నుంచి తప్పించుకున్న రిపోర్టర్ అనుభవం


"నల్లటి దుస్తులు ధరించి, ఏకే-47లతో లోపలకు వచ్చారు. చాలా కామ్ గా ఫైర్ చేశారు. వందల మందిపై తుపాకీ గుళ్లను కురిపించారు. ఆ క్షణంలో ఎవరి కళ్లలో చూసినా భయం. అరుపులు. అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నేల మీద బోర్లా పడుకున్నారు. ఓ 10 నిమిషాల సేపు థియేటర్ లో నరమేధం కొనసాగింది. ఆ 10 నిమిషాలు అత్యంత భయానకం. తమను కాపాడుకోవడానికి బోర్లా పడుకున్న వారంతా తమ తలలను కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు"... తూర్పు ప్యారిస్ లోని బెటాక్లాన్ థియేటర్ లో ఉగ్రవాదులు జరిపిన నరమేధం నుంచి క్షేమంగా బయటపడ్డ జూలియన్ పియర్స్ చెప్పిన భయానక అనుభవం ఇది. 'యూరప్ 1 రేడియో స్టేషన్'లో జూలియన్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. "నాకు తుపాకుల మోత వినపడుతోంది. టెర్రరిస్టులు చాలా సైలెంట్ గా ఉన్నారు. వాళ్లు గట్టిగా అరవడం లేదు. ముందే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. మూడు, నాలుగు సార్లు వెపన్స్ ను రీలోడ్ చేసుకున్నారు. 25 మంది వరకు అప్పటికే ప్రాణాలు వదిలినట్టు అనిపించింది" అంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు జూలియన్ తెలిపాడు. 'అల్లాహు అక్బర్' అంటూ ఉగ్రవాదులు నినాదాలు చేశారని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. తాను స్టేజ్ కు దగ్గరగా ఉండటం తన పాలిట అదృష్టంగా మారిందని జూలియన్ పియర్స్ అన్నాడు. ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించగానే, థియేటర్ లో ఉన్న ప్రేక్షకులంతా బయట పడేందుకు యత్నించారని, ఎగ్జిట్ గేట్లను చేరుకోవడానికి ప్రయత్నించారని చెప్పాడు. ఉగ్రవాదులు తమ గన్ లను రీలోడ్ చేసుకుంటున్న సమయంలో స్టేజ్ పై ఉన్న ఎగ్జిట్ గేట్ వద్దకు క్షణాల్లో చేరుకున్నానని తెలిపాడు. అదే సమయంలో అప్పటికే నెత్తురోడుతున్న ఒక టీనేజ్ అమ్మాయిని తనతో పాటు బయటకు తీసుకువచ్చానని... బయట ఉన్న ఓ ట్యాక్సీ వద్దకు వెళ్లి ఆ అమ్మాయిని హాస్పిటల్ కు తీసుకువెళ్లమని కోరానని చెప్పాడు. దాడికి పాల్పడ్డ ఒక ఉగ్రవాది ముఖాన్ని తాను చూశానని... అతని వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని జూలియన్ తెలిపాడు.

  • Loading...

More Telugu News