: టీడీపీ నుంచే రాజకీయాలు మొదలు పెట్టాను: మాజీ మంత్రి ఆనం
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మట్టి సత్యాగ్రహం వల్ల ఉపయోగం ఏంటని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, తాము రాజకీయాలు వదులుకోలేమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, తాను రాజకీయ జీవితం ప్రారంభించినది మాత్రం టీడీపీ నుంచి అని ఆయన చెప్పారు. 1991లో కాంగ్రెస్ లో చేరానని ఆయన అన్నారు. తన రాజకీయ పరిచయాలు, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని భవిష్యత్ రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం ప్రజాసేవ చేసేందుకు కాంగ్రెస్ అనుకూలంగా లేదని అన్నారు. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలకు నష్టం కలిగే నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలు తమకు తగిన బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభించడం కష్టమని ఆయన చెప్పారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల వల్ల పార్టీకి ఉపయోగం ఉండాలని, లేని పక్షంలో ఆ కార్యక్రమాలు చేపట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.