: ‘బంగ్లా’లో రెండు తలల వింత శిశువు జననం!
రెండు తలలతో ఉన్న ఒక వింత శిశువు బంగ్లాదేశ్ లో జన్మించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణ్ బారియాలోని ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, ‘ఆ మహిళకు గురువారం రోజున సిజేరియన్ నిర్వహించి కాన్పు చేశాము. రెండు తలలతో ఉన్న చిన్నారి జన్మించింది. అయితే, చిన్నారి శ్వాసకోస సమస్యలతో ఇబ్బందిపడుతోంది. ఢాకాలోని మరొక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నాము. చిన్నారి అంతర్గత అవయవాలు, శరీరంలోని మిగిలిన భాగాలన్నీ సాధారణంగానే ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది" అన్నారు. "ఈ వింత అక్కడి ప్రజలకు తెలియడంతో ఆ శిశువును చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు ఆసుపత్రికి తరలివచ్చారు. వారిని అదుపు చేయడం చాలా కష్టమైంది. శిశువు ఆరోగ్యం బాగుండకపోవడంతో ఢాకాకు తరలించాము కనుక సరిపోయింది. లేకపోతే, ఆసుపత్రికి వేల సంఖ్యలో వచ్చిన గ్రామస్తులను అదుపు చేయడం మావల్ల అయ్యేది కాదు’ అని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కాగా, వింత శిశువు తండ్రి జమాల్ మియా మాట్లాడుతూ, ‘నా బిడ్డను చూసి, ఒక్కసారి ఆశ్చర్యపోయాను. రెండు ముఖాలు, రెండు నోర్లు కదుపుతూ, రెండు ముక్కులతో గాలి పీలిస్తుండటం చూసి చాలా ఆశ్చర్యమేసింది. నేను ‘అల్లా’కు కృతఙ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు’ అని వ్యవసాయ కార్మికుడైన మియా పేర్కొన్నాడు. ఇదే సమయంలో మియా తన బాధను కూడా వ్యక్తం చేశాడు. ఒకవేళ తన భార్యకు, బిడ్డకు చికిత్స చేయించాల్సి వస్తే కనుక తన వద్ద నయా పైనా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, బంగ్లాదేశ్ లో 2008 లో కూడా ఇదే తీరులో ఉన్న రెండు తలల వింత శిశువు ఒకటి జన్మించింది. అయితే, ఎక్కువకాలం జీవించలేదని వైద్యులు పేర్కొన్నారు.