: ఉగ్రవాదుల తెలివి తేటలకు ఇదో ఉదాహరణ!
నిఘా వర్గాలు, పోలీసులు, భద్రతా వలయాలను దాటుకుంటూ దాడులకు పాల్పడాలి. ఇందుకు సంబంధించి ఎవరికీ తెలియకుండా ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలి. ఏమాత్రం తప్పు దొర్లినా పట్టుబడం, జీవితకాలం చీకటి గదుల్లో మగ్గడం ఖాయం. దీంతో ఎత్తుకు పైఎత్తులు, ఊహకందని విధంగా ప్రణాళికలు రచించుకుంటారు టెర్రరిస్టులు. దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి భత్కల్ బ్రదర్స్ వేసిన ఎత్తులు, తీసుకున్న జాగ్రత్తల గురించి తెలిస్తే..ఔరా అనాల్సిందే. బాంబు పేలుళ్లు జరిపేందుకు జరిపిన ఉత్తరప్రత్యుత్తరాల సీక్రెట్ ను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే...బాంబు పేలుళ్ల నిందితులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేందుకు ఈ మెయిల్ ను సాధనంగా ఉపయోగించుకున్నారు. 'స్టఫ్ మై స్టాకింగ్' అనే బూతు పుస్తకాన్ని కోడ్ భాషలో ఉపయోగించారు. ఈ పుస్తకంలోని పేజీలను ఒక్కొక్కరికి 10 చొప్పున పంచారు. అలా కేటాయించిన పది పేజీలలోని మొదటి పేజిలోని మెదటి పదాన్ని ఉపయోగించి ఐడీ తయారు చేసుకోవాలి. పేజ్ నెంబర్ ను పేర్కొన్నా పర్లేదు. ఈ పేజీలు ఎవరికి ఏవి కేటాయించారన్న విషయం అందరికీ తెలుసు కనుక, ఏది ఎవరి మెసేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా కోడింగ్, డీకోడింగ్ చేసుకునే వారు. అలా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపి దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన ఇన్నాళ్టికి వారి ఐడీలను ఛేదించిన పోలీసులు, వారి సంభాషణల వివరాలు తెలుసుకున్నారు.