: ఎమ్మెల్యేకు రూ.3 కోట్ల రుణమిచ్చిన ఏఎస్సై...ఆసక్తి రేపుతున్న కరీంనగర్ ఖాకీల వడ్డీ దందా
కరీంనగర్ జిల్లా ఖాకీల వడ్డీ దందాలో సమయం గడుస్తున్న కొద్దీ ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. కరీంనగర్ లో ఏఎస్సైగా పనిచేస్తున్న మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. కోట్లాది రూపాయల మేర అప్పులిస్తున్న ఆయన ఆయా రుణ గ్రహీతలకు చెందిన ఆస్తులను రాయించుకుంటూ తనదైన రీతిలో దూసుకుపోతున్నారు. మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన కరీంనగర్ జిల్లా అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డిపై నిన్న బదిలీ వేటు పడింది. తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తున్న ఈ కేసులో సీఐడీ పోలీసులు కొత్త కోణాలను వెలికితీస్తున్నారు. మోహన్ రెడ్డి వద్ద జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏకంగా రూ.3 కోట్ల మేర రుణం తీసుకున్నారట. ఇప్పటికే అరెస్టైన మోహన్ రెడ్డి తనకు బెయిల్ ఇవ్వాలని కరీంనగర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ ను నిరాకరించింది. బెయిల్ పై విచారణ జరుగుతున్న సందర్భంగా మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దని సీఐడీ అధికారులు కోర్టును అభ్యర్థించారు. ఈ సందర్భంగా తమ వాదనను బలంగా వినిపించేందుకు సీఐడీ అధికారులు ఓ నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికలోనే ఎమ్మెల్యేకు మోహన్ రెడ్డి రూ.3 కోట్ల రుణం ఇచ్చిన విషయాన్ని సీఐడీ అధికారులు ప్రస్తావించారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయి.