: మా టెక్నాలజీ దొంగిలించి 'జే-31' తయారీ: చైనాపై అమెరికా ఆరోపణ
చైనా ఇటీవల తయారు చేసిన ఐదవ తరం జెట్ యుద్ధ విమానం 'జే-31'లో తాము తయారు చేసిన ఎఫ్-35 యుద్ధ విమాన సాంకేతికతను దొంగిలించి వాడారని అమెరికా ఆరోపించింది. చైనా తాము పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశామని చెప్పుకుంటూ, దుబాయ్ ఎయిర్ షోలో జే-31ను ప్రదర్శనకు ఉంచగా, యూఎస్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ అఫైర్స్ నిపుణులు దాన్ని పరిశీలించారు. ఇది తమ ఎఫ్-35 సాంకేతికతతోనే తయారైందని, చైనా హాకర్లు ఏప్రిల్ 2009లో తమకు రక్షణ రంగ సామాగ్రి తయారు చేస్తున్న 'లాక్ హీడ్ మార్టిన్' సంస్థపై దాడి చేసి ఈ సమాచారాన్ని దొంగిలించారని వారు ఆరోపించారు. చైనా విమానం ఎయిర్ ఫ్రేమ్ నుంచి రెండు అంతర్గత ఆయుధాలు, గైడెడ్, అన్ గైడెడ్ ఆయుధాల ప్రయోగ శక్తి వంటివన్నీ ఎఫ్-35ను పోలివున్నాయని, ఆప్టికల్ విండో, ఫ్యూయల్ ప్లేస్ మెంట్, రాడార్ డోమ్ తదితరాల్లో కనీస డిజైన్ మార్పులు కూడా లేవని యూఎస్ డిఫెన్స్ వీక్లీకి వారు తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను చైనా మాత్రం కొట్టిపారేస్తోంది.