: చూశారా?... మన అమరావతి కోసం బ్రిటన్ కదిలింది: చంద్రబాబు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం సహకరించేందుకు బ్రిటన్ వంటి దేశం ముందుకు రావడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుపతిలో జరుగుతున్న రెండు రోజుల తెలుగుదేశం పార్టీ దిశానిర్దేశ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బ్రిటన్ కు తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. 2022 నాటికి ఇండియాలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉండాలన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణానికి మరో ఐదేళ్లు పడుతుందని, అందువల్లే పట్టిసీమను కేవలం ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేసి కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశామని వివరించారు. నీరు - చెట్టు కార్యక్రమం కింద చేపట్టిన కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. హంద్రీనీవా పథకం ద్వారా జూన్ నాటికి చిత్తూరుకు నీరందించి తీరుతామని, మిగతా ప్రాజెక్టుల ద్వారా సీమలోని అన్ని చెరువులకూ నీరు చేరుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. తన పాలనపై విపక్షాలు అనవసర రాద్ధాంతం, అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఏ ప్రాజెక్టు నిర్మాణంలోనూ అవినీతికి తావులేకుండా చేస్తానని, తనకు అనుమానం వస్తే, రాత్రిళ్లు అక్కడే పడుకుంటానని బాబు వివరించారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా చేయడం కోసం అహర్నిశలూ శ్రమిస్తానని తెలిపారు.