: బ్రిటన్ నుంచి వచ్చాక మోదీ తేల్చుకోవాల్సిన సవాళ్లివే!
ప్రస్తుతం యూకే, ఆపై టర్కీ పర్యటనల అనంతరం స్వదేశానికి తిరిగివచ్చే ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్నో సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీలో ఎల్.కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లు రాసిన లేఖ సృష్టించే సమస్య ఒకటైతే, పక్కలో బల్లెంలా ఉన్న ఆర్ఎస్ఎస్ నుంచి వస్తున్న విమర్శల జడివానను ఆయన ఎదుర్కోవాల్సి రావడం మరొకటి. బీహారులో ప్రచారాన్నంతా స్వయంగా మోసి ఓటమికి కారణమయ్యారన్న విమర్శలకు మోదీ ఎలా సమాధానం చెప్పుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మంత్రుల కట్టడి, కర్ణాటకలో తాజాగా చెలరేగిన 'టిప్పు సుల్తాన్' హింస వంటి సవాళ్లు ఆయనకు ఎదురెళ్లనున్నాయి. వీటితో పాటు బీహార్ ఫలితాల అనంతరం హడావుడిగా ప్రకటించిన ఎఫ్డీఐ పరిమితుల సవరణలకు పార్లమెంట్ ఆమోదం ఆయన ముందున్న మరో ప్రధాన సవాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ వంటివి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలే. రాజ్యసభలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ లేకపోవడం విపక్షాలకు కలిసొచ్చే అంశం కాగా, మోదీ చరిష్మా ఇక ఏ మాత్రం చెల్లదని జరుగుతున్న ప్రచారానికి ఆయన తనదైన శైలిలో ఏ మంత్రం వేసి తెరవేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న బీజేపీపై సొంత పార్టీ నేతలే ప్రశ్నాస్త్రాలతో కూడిన ఆరోపణలు చేస్తుండటం ప్రభుత్వంలోని ప్రధాన నేతలకు మింగుడుపడటం లేదని తెలుస్తోంది. 1984 తరువాత బీజేపీ ఏ ఎన్నికల్లో ఓడిపోయినా, సరైన సమీక్ష ఒక్కసారిగా కూడా జరగలేదని ఢిల్లీ బీజేపీ నేత క్రిషన్ లాల్ శర్మ ఓ లేఖను రాశారు. 1991లో ఐదు రాష్ట్రాల్లో ఓడిపోయినప్పుడు, ఆపై మొన్నమొన్న కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఢిల్లీలో ఘోర పరాజయం, నేటి బీహార్ ఓటములను ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన కూడా జరగవచ్చని వార్తలు వస్తున్నాయి. మంత్రులుగా ఉండి ప్రజల్లో విభేదాలు పెంచే వ్యాఖ్యలు చేస్తున్న వారి తొలగింపు తప్పదని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, కొత్తగా పదవుల కోసం చూస్తున్న నేతల లాబీయింగ్ పెరిగింది. ఎవరిని తొలగించినా వారి నుంచి వచ్చే అసంతృప్తిని కూడా మోదీ ఎదుర్కోక తప్పదు. ఏదిఏమైనా తనకు స్వాగతం చెప్పే సవాళ్లను ఆయన ఎలా స్వీకరించి బయటపడతారన్నది ఆసక్తికరంగా మారింది.