: పార్టీని, ప్రజలను అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్లండి... పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
తిరుపతిలో ఈరోజు ప్రారంభమైన టీడీపీ దిశా-నిర్దేశ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయామని అన్నారు. ఇలాంటి సమయంలో పార్టీని, ప్రజలను అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్లాలని పార్టీ నేతలకు నిర్దేశం చేశారు. అటు లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆదాయాలు పెంచుకునేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2022కల్లా భారత్ లోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఏపీ ఉండాలని, 2050 నాటికి భారత్ లోని ఒక అత్యున్నతమైన స్థానంలో ఏపీ ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక ప్రభుత్వం 'నీరు-చెట్టు' కింద చేపట్టిన కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని చెప్పారు. హంద్రీ-నీవా ద్వారా రాబోయే జూన్ వరకు చిత్తూరుకు నీళ్లు వస్తాయన్న సీఎం, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, సోమశిల ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. రాయలసీమ శాశ్వత కరవు నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పోలవరం ప్రాజెక్టు ఏడు ముంపు మండలాలను ఏపీకి తెచ్చుకున్నామని ఈ సందర్భంగా బాబు ప్రస్తావించారు.