: సిరిసిల్ల రాజయ్య రెండో కోడలు సనకు వైద్య పరీక్షలు... మరికాసేపట్లో కోర్టుకు తరలింపు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. గతవారం సిరిసిల్ల రాజయ్య ఇంటిలోనే సారిక తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు (సారిక భర్త) అనిల్ కుమార్ లను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణలో భాగంగా అనిల్ రెండో భార్య సన పాత్ర కూడా కీలకమని తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. గతవారమే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వినిపించాయి. తమదైన శైలిలో సనను విచారించిన పోలీసులు కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. తాజాగా కొద్దిసేపటి క్రితం పోలీసులు సనను వైద్య పరీక్షల నిమిత్తం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం సనను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.