: రక్షణ మంత్రిపైనే వర్ణ వివక్ష వ్యాఖ్యలు... విచారణకు ఆదేశం
కెనడా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి హర్జిత్ సింగ్ సజ్జన్ పై ఓ సైనికుడు విషం కక్కాడు. రక్షణ మంత్రి అన్న గౌరవం కూడా లేకుండా ఫేస్ బుక్ లో ఆయనపై ఏకంగా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. దీనిపై కెనడా రక్షణ శాఖ సీరియస్ అయింది. విచారణకు ఆదేశించింది. అయితే సదరు సైనికుడు ఎలాంటి కామెంట్ చేశాడనే విషయాన్ని మిలిటరీ వెల్లడించలేదు. 'ది గ్లోబ్ అండ్ మెయిల్' కథనం ప్రకారం... నాన్ కమిషన్డ్ మెంబర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి సభ్యసమాజం అంగీకరించలేని వ్యాఖ్యలు చేశాడని... హర్జిత్ సజ్జన్ జాతి మూలాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేశాడని పేర్కొంది. ఫ్రెంచ్ లో రాసిన ఈ వ్యాఖ్యలను వెంటనే తొలగించారని తెలిపింది. ఆర్మీకి చెందిన అత్యున్నత అధికారులు ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు. ఆర్మీ ప్రతినిధి డాన్ లీ బౌతిలియర్ ఈ ఘటనపై స్పందిస్తూ, వర్ణ వివక్ష వ్యాఖ్యలను ఆర్మీ అనుమతించదని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో భద్రతాదళాలు బలహీనపడతాయని తెలిపారు. ఇలాంటి నైజాన్ని ఆర్మీ ఉక్కుపాదంతో అణచివేస్తుందని చెప్పారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఆర్మీ సమాన దృష్టితో చూస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు, హర్జిత్ సింగ్ చిన్న వయసులో ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు కెనడాకు వలస వచ్చేశారు.