: జీపులో పర్యాటకులు...చుట్టూ సింహాలు!: సెరెంగెటే పార్కులో ఒళ్లు జలదరించే సన్నివేశం


వన్య ప్రాణులను చూస్తూ హాలీడేస్ ను జాలీగా గడిపేద్దామని టాంజానియాలోని సెరెంగెటే జాతీయ పార్కుకు వెళ్లిన ఓ పర్యాటక బృందానికి అక్కడ భయానక అనుభవం ఎదురైంది. సరదాగా జంతువులను చూస్తూ ఆ బృందం సభ్యులంతా జీపులో వెళుతున్నారు. ఎప్పుడొచ్చాయో కాని రెండు సింహాలు ఆ జీపును చుట్టుముట్టాయి. జీపును కదలకుండా చేద్దామనుకున్నాయో, ఏమో తెలియదు కాని జీపు టైరును కొరికిపడేశాయి. ఇంకేముంది, జీపు అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఆ తర్వాత జీపులో ఉన్న వారిని కబళించేందుకు లంఘించిన సింహాలు అద్దాలు పగులగొట్టేందుకు యత్నించాయి. దాదాపు గంట పాటు సింహాలు చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో నిరాశగా సింహాలు అక్కడి నుంచి కదిలివెళ్లిపోయాయి. ఈ తతంగం జరుగుతున్నంతసేపు ఎక్కడ సింహాలు తమను ముక్కలుగా కొరికి చంపేస్తాయోనన్న భయంతో జీపులోని పర్యాటకులు బిక్కచచ్చిపోయారు. అయితే సింహాలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ పర్యాటక బృందం బతుకు జీవుడా అంటూ ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇంతటి ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాన్ని సెరెంగెటే పార్కులో పర్యాటక గైడ్ గా పనిచేస్తున్న ఇమ్మనుయేల్ బయో తన కెమెరాలో బంధించారు. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News