: మోదీ ప్రధాని కావడాన్ని అద్వానీ ఓర్వలేకపోతున్నారు: యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ కురువృద్ధుడు ఎల్.కే.అద్వానీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడాన్ని అద్వానీ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఓర్వలేనితనం వల్లే అద్వానీ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఓటమికి మోదీ, అమిత్ షాలు కారణం కాదని యడ్డీ చెప్పారు. వీరిద్దరూ బీజేపీకి అనేక ఘన విజయాలు సాధించి పెట్టారని అన్నారు. బీహార్ ఓటమి నుంచి అంతా గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. ఏ విషయం గురించైనా నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడుకోవాలని... బహిరంగ విమర్శలకు దిగితే పార్టీ పరువు పోతుందని మండిపడ్డారు. ఏదేమైనప్పటికీ, అద్వానీపై ఇంత బహిరంగంగా విమర్శలు గుప్పించిన తొలి నేతగా యడ్యూరప్ప నిలిచారు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి.