: ఇండియాలో తయారైన తొలి బీఎండబ్ల్యూ బైక్ ఇదే!
బీఎండబ్ల్యూ... ప్రపంచవ్యాప్తంగా హైఎండ్ బైక్ లను తయారు చేసే సంస్థ. బీఎండబ్ల్యూ బెంగళూరులో ప్లాంటును ప్రారంభించిన తరువాత తయారు చేసిన 'జీ310ఆర్' మోడల్ బైక్ ను తొలిసారిగా బయటి ప్రపంచానికి చూపింది. స్టంట్ కాన్సెప్ట్ లో దీన్ని తయారు చేశామని సంస్థ చెబుతోంది. ఈ బైక్ డిజైన్, ఇంజనీరింగ్ తదితరాలు జర్మనీలోని మ్యూనిచ్ లో జరిగాయని, దీనితో ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్ షేర్ పెరుగుతుందని భావిస్తున్నామని భారత వాతావరణానికి తగ్గట్టుగా దీన్ని తయారు చేశామని సంస్థ వెల్లడించింది. 200 బీహెచ్పీ పవర్ ను అందించే ఎస్1000 ఆర్ఆర్ ఇంజన్, కుదుపులను తగ్గించేందుకు డీఎల్సీ విధానాన్ని అమలు చేశామని, ఈ తరహాలోని మిగతా బైక్ లతో పోలిస్తే ఇది తక్కువ బరువుంటుందని సంస్థ అధికారులు తెలిపారు. సంవత్సరానికి రెండు లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేస్తామని వారు తెలిపారు. కాగా, ఇప్పటికే మార్కెట్లో ఉన్న కేటీఎం డ్యూక్ 390, కవాసకీ జడ్ 250లకు ఇది గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.