: ఇక ఎంపీల వంతు... కన్నడ నాట బీజేపీ ఎంపీకి బెదిరింపులు
కన్నడనాట బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. మత సంబంధింత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ప్రముఖ రచయిత కాల్ బుర్గీని బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తులు ఆ తర్వాత ఆయనను ఏకంగా హత్య చేశారు. ఈ హత్య ఒక్క కర్ణాటకలోనే కాక దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలకు కారణమైంది. తాజాగా టిప్పు సుల్తాన్ జయంతిని పురస్కరించుకుని తన డిమాండ్ ను వినిపించిన ప్రముఖ నటుడు గిరీశ్ కర్నాడ్ కు కూడా బెదిరింపులు ఎదురైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును టిప్పు సుల్తాన్ విమానాశ్రయంగా మార్చాలని గిరీష్ డిమాండ్ చేశారు. ఇలాంటి డిమాండ్లు చేస్తే కాల్ బుర్గీకి పట్టిన గతే మీకూ తప్పదని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో కర్నాడ్ ను బెదిరించారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత, కొడగు ఎంపీ ప్రతాప్ సిన్హాకు కూడా బెదిరింపులు ఎదురయ్యాయి. టిప్పు సుల్తాన్ జయంతిని వ్యతిరేకించిన కారణంగానే ప్రతాప్ సిన్హాకు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు నిన్న ప్రతాప్ సిన్హా పోలీసులను ఆశ్రయించారు.