: నేనిచ్చిన నినాదంతోనే కామెరూన్ కు విజయం!...అందుకు రాయల్టీ చెల్లించాల్సి ఉందన్న మోదీ
బ్రిటన్ పర్యటనలో భాగంగా మోదీ తనదైన శైలిలో దూసుకువెళుతున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా నిన్న ఆయన బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోదీ తనదైన శైలిలో చలోక్తులు విసిరి బ్రిటన్ ఎంపీల మోముల్లో నవ్వులు పూయించారు. గడచిన బ్రిటన్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని జేమ్స్ కామెరూన్ కు తానో నినాదాన్ని ఇచ్చానని మోదీ పేర్కొన్నారు. ‘‘ఫిర్ ఏక్ బార్... కామెరూన్ సర్కార్’ అన్న ఆ నినాదంతోనే కామెరూన్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారని మోదీ చెప్పారు. తానిచ్చిన నినాదంతో విజయం సాధించిన కామెరూన్, తనకు రాయల్టీ చెల్లించాల్సి ఉందని కూడా మోదీ చలోక్తి విసిరారు. ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంటు సమావేశాలు జరగడం లేదని, ఈ కారణంగానే కామెరూన్ మోములో విశ్రాంతి కనిపిస్తోందని కూడా మోదీ అన్నారు. భారత్, బ్రిటన్ మధ్య నెలకొన్న బలమైన సంబంధాలను ప్రస్తావించిన మోదీ... బ్రూక్ బాండ్ టీ, జాగ్వార్, డేవిడ్ బెక్ హాంలను ఉటంకించారు. ‘‘బ్రూక్ బాండ్ టీ, జాగ్వార్ తదితర వస్తువులు భారతీయ వస్తువులా? బ్రిటన్ వస్తువులా? అన్నది చెప్పడం కష్టం. అంతలా భారత్, బ్రిటన్ లు కలిసిపోయాయి. భారత్ లోని ప్రతి ఔత్సాహిక ఫుట్ బాల్ క్రీడాకారుడు తాను డేవిడ్ బెక్ హాంలా తయారు కావాలని కోరుకుంటాడు. ఇది ఇరు దేశాల మధ్య భావోద్వేగాలకు నిదర్శనం’’ అని మోదీ అన్నారు.