: పెళ్లి పేరెత్తితే బ్రోతల్ కేసులో ఇరికిస్తా.... ఓ వైద్యుడి నిర్వాకం
పెళ్లి పేరుతో వంచించి, కటకటాల వెనక్కి వెళ్లిన ఓ వైద్యుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. హైదరాబాదు, దిల్ సుఖ్ నగర్ లో నివాసముండే రణ్ ధీర్ రెడ్డి (27) ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాదు లోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తొమ్మిది నెలల క్రితం ఆయనకు వీ ఛాట్ లో యూసఫ్ గూడ జవహర్ నగర్ కు చెందిన యువతి (25) తో పరిచయమైంది. ఈ సంభాషణ హద్దులు మీరడంతో ఓ రోజు రణ్ ధీర్ రెడ్డి సదరు యువతి ఇంటికి వెళ్లి వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఒకే కులం కావడంతో ఇబ్బందులు కూడా ఉండవని నమ్మబలికాడు. దీంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఆమె గర్భం దాల్చడంతో పీజీ చేసేందుకు జర్మనీ వెళ్తున్నానని, రాగానే వివాహం చేసుకుంటానని చెప్పాడు. వివాహం గురించి మాట్లాడుదాం అంటూ ఆ యువతిని ఈ నెల 1న దేవరకొండ తీసుకెళ్లిన రణ్ ధీర్ రెడ్డి, అక్కడ తమ వివాహానికి తన తల్లి, సోదరుడు సుముఖంగా లేరని చెప్పాడు. లేదు పెళ్లి కావాల్సిందే అంటే 8 కోట్లు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే బ్రోతల్ కేసులో ఇరికిస్తానని, అంతం చేసేందుకు కూడా వెనుకాడేది లేదంటూ హెచ్చరించి, యూసఫ్ గూడలో వదిలేసి వెళ్లాడు. దీంతో యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిపై 417, 420, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని రిమాండ్ కు తరలించారు.