: ఆ పేరును మార్చే ప్రసక్తే లేదు: సిద్ధరామయ్య
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఎట్టి పరిస్థితుల్లోను మార్చబోమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కెంపెగౌడ విమానాశ్రయం పేరును టిప్పు సుల్తాన్ విమానాశ్రయంగా మార్చాలనే వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరును పెట్టాలని తాను చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, కర్ణాటక ప్రభుత్వం ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వాలని సూచించారు. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పారు. మరోవైపు, కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.