: ప్రాణాంతక బ్లడ్ కేన్సర్ కు నూతన ఔషధం
ప్రాణాంతక వ్యాధి బ్లడ్ కేన్సర్ (లుకేమియా) కు మందు కనుగొని ఎన్నో జీవితాల్లో ఆశలు నింపారు పరిశోధకులు. ఇప్పటి వరకు బ్లడ్ కేన్సర్ కు చేస్తున్న కీమోథెరపీ చికిత్సలో ప్రభావవంతగా పని చేసే ఔషధాల కొరతను అధిగమించేందుకు చేసిన పరిశోధనల్లో కీలమైన ముందడుగు వేశారు. గతంలో మెరుగైన ఔషధాలు లేని కారణంగా ఫలితాల్లో హెచ్చుతగ్గులు కనిపించేవి. వీటిని అధిగమించే క్రమంలో జరిపిన పరిశోధనల్లో భాగంగా సరికొత్త ఔషధాన్ని ఆవిష్కరించినట్టు లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. జీఎస్-4059 అనే ఔషధాన్ని అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఈ ఔషధం మెరుగైన ఫలితాలు అందిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన 90 మంది బ్లడ్ కేన్సర్ రోగులపై దీనిని ప్రయోగించామని, జీఎస్-4059 ఔషధం కేన్సర్ లోని బీటీకే అనే ప్రోటీన్ ను నిరోధించడం ద్వారా కేన్సర్ వృద్ధికి అడ్డుకట్టవేస్తోందని వారు తెలిపారు. కేన్సర్ వైద్యంలోని కీమోథెరపీలో జీఎస్-4059 ఔషధం నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.