: నేను అలా అనలేదు... మీడియా వక్రీకరించింది: శతృఘ్న సిన్హా
బీహార్ ఎన్నికల్లో తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే బీజేపీకి మరిన్ని స్థానాలు వచ్చుండేవనే విషయాన్ని తాను ఎప్పుడూ అనలేదని ఆ పార్టీ ఎంపీ శతృఘ్న సిన్హా స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను ప్రచారం చేసి ఉంటే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని మాత్రమే తాను అన్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు. ఎన్నికల ఫలితాలతో తాము ఆవేదనకు గురవుతున్నామని... అయితే, బాధ్యతలకు దూరంగా మాత్రం పారిపోమని చెప్పారు. తాను రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం లేదని... ప్రజల అండదండలతో రెండు సార్లు భారీ మెజారిటీతో లోక్ సభకు ఎంపికయ్యానని శతృఘ్న సిన్హా చెప్పారు. ప్రచార బాధ్యతలను తనకు ఇవ్వకపోవడం ద్వారా... తన మిత్రులకు, ఓటర్లకు, అభిమానులకు తనను దూరం చేశారని అన్నారు. తాను ప్రచారానికి వచ్చుంటే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని చెప్పారు.