: బీహార్ లో ఓటమికి సమష్టి బాధ్యత వహించాల్సిందే: వెంకయ్యనాయుడు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎవరినీ బాధ్యులను చేయటం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ మొదటి నుంచి సమష్టి నాయకత్వం, బాధ్యతతో ముందుకెళుతోందని చెప్పారు. ఈ క్రమంలో ఓటమికి సమష్టి బాధ్యత వహించాల్సిందేనన్నారు. ఒక రాష్ట్రంలో గెలవడం, మరో రాష్ట్రంలో ఓడిపోవటం సహజమేనని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల వల్ల కేంద్రానికి, నాయకత్వానికి వచ్చిన నష్టమేమి లేదని వెంకయ్య స్పష్టం చేశారు. అయితే స్థానిక అంశాలు, సామాజిక సమీకరణాల వల్లే ఓడిపోయామని చెప్పారు. ఢిల్లీలో ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీ చాలా ఎన్నికల్లో గెలిచిందని, కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఓడిపోయిందని తెలిపారు. అయితే కేంద్ర ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో ఉండకపోవచ్చని వెంకయ్య చెప్పుకొచ్చారు.