: వెనిజులా అధ్యక్షుడి బంధువులను అరెస్ట్ చేసిన అమెరికా... ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత
అమెరికాలోని 800 కిలోల కొకైన్ ను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో సతీమణి సిలియా ఫ్లోరిస్ దగ్గరి బంధువులు ఈఫ్రెయిన్ ఆంటోనియో, ఫ్రాన్సిస్కో ఫ్లోర్స్ డే ప్రెయితాస్ లను హైతీలోని పోర్ట్-ఔ-ప్రిన్స్ లో అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న అమెరికా, వెనిజులా మధ్య సంబంధాలు మరింతగా బలహీనపడ్డాయి. తాము అదుపులోకి తీసుకున్న వారికి మాదకద్రవ్యాల రవాణాతో సంబంధముందని, తమకు సహకరించాలని యూఎస్ అధికారులనూ వీరు కోరారని, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని అమెరికా చెబుతుండగా, వెనిజులా దీన్ని ఖండిస్తోంది. వీరిద్దరూ సిలియో ఫ్లోరిస్ మేనల్లుళ్లని తెలుస్తోంది. ఆంటోనియో, తాను మదురో మారు కుమారుడినని, చిన్నప్పటి నుంచి సిలియోనే తనను పెంచిందని పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. కొలంబియా, కరాకస్ తదితర ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చే మత్తు పదార్థాలను తరలించేందుకు ప్రధాన కేంద్రంగా వెనిజులా సహకరిస్తోందని చాలా కాలంగా యూఎస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలూ తమతమ రాయబారులను వెనక్కి పిలిపించుకున్నాయి. తన భార్య బంధువుల అరెస్టుపై మదురో సైతం సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.