: శశి థరూర్ కు ‘సత్య శోధన’ పరీక్ష తప్పదా?... ‘సునంద’ ఎఫ్ బీఐ రిపోర్టే నేపథ్యం!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. థరూర్ సతీమణి సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఆయనను ప్రశ్నించారు. అయితే ఇప్పటిదాకా ఆమె మృతికి గల కారణాలు వెల్లడి కాలేదు. పోస్ట్ మార్టం చేసిన ఎయిమ్స్ వైద్యులు విష ప్రయోగం కారణంగానే ఆమె చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఏ విష పదార్థం ఇందుకు కారణమన్న విషయాన్ని తేల్చేందుకు అవసరమైన ల్యాబ్ వసతులు తమ వద్ద లేవని చెప్పారు. ఈ నేపథ్యంలో సునంద శరీర భాగాల శాంపిళ్లను పోలీసులు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు పంపారు. వాటిని సునిశితంగా పరిశీలించిన ఎఫ్ బీఐ అధికారులు నిన్న ఢిల్లీ పోలీసులకు 8 పేజీల నివేదికను అంజేశారు. పొలోనియం సహా ఇతర రేడియోధార్మిక పదార్థాల కారణంగా సునంద చనిపోలేదని ఆ నివేదికలో ఎఫ్ బీఐ తేల్చిచెప్పింది. దీంతో ఆమె మృతి వెనుక ఉన్న కారణాలను నిగ్గు తేల్చేందుకు ఢిల్లీ పోలీసులు మరోమారు రంగంలోకి దిగక తప్పడం లేదు. ఇందులో భాగంగా శశి థరూర్ కు సత్యశోధన (నార్కో అనాలసిస్ టెస్ట్) పరీక్షలు నిర్వహిస్తే తప్ప అసలు వాస్తవాలు వెలుగు చూసేలా లేవని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నార్కో పరీక్షల కోసం థరూర్ కు త్వరలోనే నోటీసులు అందే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.