: ప్రధానికి ఎదురుగాలి వీయడానికి కారణం ఏంటి?
బీహార్ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేకతతో తిరుగులేని విజయం సాధించిన మోదీ, స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ గడిపారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు తప్ప విదేశీ పర్యటనల్లో ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎన్నెన్నో హామీలు గుప్పించిన మోదీ విజయం సాధించిన తరువాత వాటిని మర్చిపోయారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. మోదీ మార్కు చూపేందుకు జన్ ధన్ యోజన పథకం చేపట్టారు. ఈ పథకంలో ప్రజలే బీమా చేయించుకోవాలి. అందులో ప్రత్యేకత ఏమీ లేదనే భావన రావడంతో అది ఆరంభశూరత్వమే తప్ప కార్యసాధనగా నిలవలేదు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సెలెబ్రిటీలు సెల్ఫీలు తీసుకుని ఫేస్ బుక్, ట్విట్టర్లో ఫోటోలు పెట్టుకునేందుకు తప్ప దేశం స్వచ్ఛంగా మారేందుకు ఉపయోగపడలేదు. నీతి ఆయోగ్ ద్వారా ప్రజలకు అదనంగా ఒరిగిన ప్రయోజనం లేదు సరికదా, స్వచ్ఛ భారత్ పన్నును అదనంగా విధించేందుకు ఉపయోగపడింది. ఇక మేకిన్ ఇండియా పేరిట ప్రపంచానికి పరిచయమైన భారత్ సింహం పరిశ్రమలు తెచ్చేందుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. పోనీ 56 అంగుళాల ఛాతీతో నల్లధనం వెలికి తీసుకువచ్చారా? అంటే, కాంగ్రెస్ కంటే అధ్వానంగా కేవలం 3 వేల కోట్ల రూపాయలే వసూలయ్యాయంటూ సదరు నేతలే చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అద్భుతాలు జరిగిపోతాయని ఎదురు చూసిన ప్రజలకు త్వరలోనే దేశంలో ఏం జరుగుతుందో తెలియవచ్చింది. దీనికి అదనంగా అభివృద్ధి పేరిట భూసేకరణ బిల్లు, జీఆర్టీ బిల్లును సమర్థించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశంలో నింగి, నీరు తప్ప అన్నీ ప్రైవేటు మయం చేసేందుకు వీలైనంత ఎక్కువ మంది పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రయత్నించడం బెడిసికొట్టింది. అదే సమయంలో మతం పేరిట బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమించడం ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. అదే సమయంలో గుజరాత్ లో పటేల్ వర్గం రిజర్వేషన్లపై పూరించిన సమర శంఖం మెజారిటీ వర్గానికి నచ్చలేదు. బీజేపీ దీనిని ఖండించలేదు సరికదా, ప్రోత్సహించే ధోరణితో వ్యవహరించడం వివిధ వర్గాలకు కంటగింపుగా మారింది. ఫలితంగా బీహార్ లో బీజేపీ బొక్క బోర్లా పడిందని బీజేపీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో పార్టీ ఇమేజ్ ప్రజల్లో పలచబడిందని నిర్ణయానికి వచ్చారు. సార్వత్రిక ఎన్నికల విజయం ఓ గాలి తెరలా భావించని అమిత్ షా, అదంతా తమ పాపులారిటీయేనని భావించి ఘోరపరాజయానికి కారణమయ్యారని వారు పేర్కొన్నారు. దీంతో బీజేపీలో ఏం జరిగినా చూస్తూ ఊరుకున్న సీనియర్లు బీహార్ ఓటమి తరువాత ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడిని అదుపులో ఉంచేందుకు విమర్శబాణం ఎక్కుపెట్టారు. దీంతో వివిధ రాష్ట్రాల్లోని నేతలు కూడా వారిపై విమర్శలు పెంచుతున్నారు. తాజాగా జార్ఖండ్ ఎంపీలు ప్రధాని మోదీ, అమిత్ షా తీరుపై మండిపడ్డారు.