: ఐపీఎస్ లక్ష్మీనారాయణ కూడా ‘శ్రీమంతుడే’... పాలమూరు పల్లె చిన్నమందడిని దత్తత తీసుకున్న సీబీఐ మాజీ జేడీ
ప్రిన్స్ మహేశ్ బాబు లేటెస్ట్ సినిమా ‘శ్రీమంతుడు’ పెద్ద సంఖ్యలో ప్రముఖులను పల్లెబాట పట్టిస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని అత్యంత వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో మహేశ్ బాబుతో పాటు మరో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఓ పల్లెను దత్తత తీసుకున్నారు. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో మాజీ జాయింట్ డైరెక్టర్ గా తెలుగు ప్రజలకు చిరపరితులైన లక్ష్మీనారాయణ అదే జిల్లాలోని చిన్నమందడి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 2013లోనే ‘వందేమాతరం’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో సదరు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆయన, తాజాగా నేటి ఉదయం గ్రామంలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ తో కలిసి గ్రామానికి వచ్చిన ఆయన గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు తాము పుట్టిన గ్రామాన్ని దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చిన్నమందడిని దేశంలోనే ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు చేపడతామని ప్రకటించారు. భవిష్యత్తులో జిల్లాలోని మరిన్ని గ్రామాలను దత్తత తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. చిన్నమందడి అభివృద్ధికి తాము చేస్తున్న కృషికి జిల్లా అధికార యంత్రాంగం కూడా తమవంతు సహకారం అందిస్తోందని ఆయన చెప్పారు.