: 30 ఏళ్ల క్రితం సేకరించిన వేలి ముద్రలే ‘చోటా’ను భారత్ కు రప్పించాయట!


మాఫియా డాన్ చోటా రాజన్ ను ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేయడంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ కీలకంగా వ్యవహరించి ఉండవచ్చు. ఇందులో సీబీఐది కూడా కీలక భూమికే. ఈ కారణాల వల్లే ఇండోనేసియా పోలీసులు చోటా రాజన్ ను ముందు భారత్ కు అప్పగించలేదు. అంతేకాదు, తాము అరెస్ట్ చేసిన చోటా రాజన్, మీ దేశంలో ఎక్కడ నేరాలు చేశాడో, అసలు మీరు చెబుతున్న వ్యక్తి అతడేనా? అని కూడా సీబీఐ అధికారులను ఇండోనేసియా పోలీసులు ప్రశ్నించారు. తాము చెబుతున్న చోటా రాజన్ ఇతడే అని చెప్పేందుకు ఆ సమయంలో సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు కూడా లేవు. దీంతో చోటా రాజన్ ను భారత్ కు తీసుకొచ్చేందుకు ఇండోనేసియా వెళ్లిన సీబీఐ అధికారులు తెల్ల మొహాలేశారు. అయితే సీబీఐ అధికారులను ముంబై పోలీసులే గట్టెక్కించారు. అప్పుడెప్పుడో 1980, 1983లలో ముంబైలో చోటా మోటా గ్యాంగ్ స్టర్ గా ఉన్న సమయంలో చోటా రాజన్ వేలి ముద్రలను ముంబై పోలీసులు సేకరించారు. వాటి ఆధారంగానే భారత్ చెబుతున్న చోటా రాజన్ తాము అరెస్ట్ చేసిన వ్యక్తేనని నమ్మిన ఇండోనేసియా పోలీసులు అతడిని సిబీఐకి అప్పగించారట. 30 ఏళ్ల నాడు సేకరించిన సదరు వేలి ముద్రలు లేకపోతే, చోటా రాజన్ ను భారత్ కు రప్పించడం దాదాపుగా సాధ్యం కాకపోయి ఉండేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News