: బీహార్ ఓటమితో మోదీ ప్రాభవం తగ్గలేదు...యూపీ ఎన్నికలే మోదీ సత్తాకు గీటురాయి: పాక్ పత్రిక ఆసక్తికర కథనం


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల మార్గదర్శకత్వంలో బీజేపీ బరిలోకి దిగింది. అయితే ఊహించని విధంగా మహా కూటమి చేతిలో మట్టి కరిచింది. దీంతో బీహార్ లో బీజేపీ ఓటమికి మోదీ, అమిత్ షాలే బాధ్యత వహించాలంటూ ఆ పార్టీ సీనియర్లు స్వరం పెంచారు. అంతేకాక అత్యంత రసవత్తరంగా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో మోదీ ప్రాభవం కొడిగట్టిందని అమెరికా సహా బ్రిటన్, పాకిస్థాన్ దేశాలకు చెందిన పలు పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి. అయితే పాక్ కు చెందిన ప్రధాన పత్రిక ‘ద నేషన్’ మాత్రం ఇందుకు విరుద్ధమైన కథనం ప్రచురించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మోదీ ప్రాభవం కించిత్తు కూడా తగ్గలేదని ఆ పత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని రాసింది. భారత్ లోని 30 (ఢిల్లీ సహా) రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటని పేర్కొన్న ఆ పత్రిక, ఒక్క రాష్ట్రంలో ఓటమితోనే ప్రధాని మోదీ ప్రతిష్ఠ మంటగలిసిందని ఎలా చెబుతారని కూడా ప్రశ్నించింది. అయితే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రం మోదీ సత్తాకు గీటురాయిగా నిలవనున్నాయని ఆ కథనం పేర్కొంది. మతపరంగా ఎప్పటికప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు కేంద్రంగా మారుతున్న ఉత్తరప్రదేశ్ భారత్ లో ఓ పెద్ద రాష్ట్రమని, ఆ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు మాత్రం మోదీ సత్తాకు కొలబద్ద అని ‘ద నేషన్’ కథనం అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News