: ‘రేవాను’ వెంకన్న భక్తులకు వరమే!... ఏడాది పాటు నీటి కొరత రాదంటున్న టీటీడీ ఈవో


బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం రేవాను తుపానుగా మారి తమిళనాడు, పుదుచ్ఛేరిలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పెను విధ్వంసాన్ని సృష్టించింది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో రేవాను తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా పోటెత్తిన వరదకు పలువురు కొట్టుకుపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రేవాను తుపాను తిరుమల వెంకన్న భక్తులకు వరమేనని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) సాంబశివరావు పేర్కొంటున్నారు. ఈ తుపాను కారణంగా రోజుల తరబడి తిరుమలలో వర్షం కురుస్తోంది. భక్తులు నానా పాట్లు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఘాట్ రోడ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు ఘాట్ రోడ్లు దాదాపుగా మూతపడ్డాయి. అయితే వెనువెంటనే రంగంలోకి దిగిన టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతూ భక్తుల ఇబ్బందులను తొలగిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేవాను తుపాను వెంకన్న భక్తులకు వరమెలా అవుతుందనేగా మీ అనుమానం? తిరుమల పరిధిలోని జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టంతో కనిపించి చాలా కాలం అవుతోంది. దీంతో కొండపై ఎప్పటికప్పుడు తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే రేవాను తుపాను పుణ్యమా అని ప్రస్తుతం తిరుమల కొండ పరిధిలోని అన్ని జలాశయాలకు జలకళ వచ్చేసింది. అన్ని జలాశయాలు వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయాయి. దీంతో మరో ఏడాది పాటు చుక్క వర్షం కురవకున్నా, తాగు నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కొద్దిసేపటి క్రితం టీటీడీ ఈవో సాంబశివరావు ప్రకటించారు.

  • Loading...

More Telugu News