: 65 ఏళ్లలో ఒక్క న్యాయకోవిదుడూ ‘సుప్రీం’ జడ్జి కాలేకపోయారు: కేంద్రం సంచలన ప్రకటన


దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, రాష్ట్రాల్లోని అత్యున్నత న్యాయస్థానాలు హైకోర్టుల న్యాయమూర్తులను నియమించే విషయంలో నిన్నటిదాకా కొనసాగుతూ వస్తున్న కొలీజియం వ్యవస్థలను రద్దు చేసేందుకు చేసిన యత్నం బెడిసికొట్టడంతో నరేంద్ర మోదీ సర్కారు నిన్న సంచలన ప్రకటన చేసింది. స్వతంత్ర భారతదేశంలో 65 ఏళ్లుగా ఒక్క న్యాయకోవిదుడు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాలేకపోయారని ప్రకటించింది. ఈ విషయంలో ఇప్పటిదాకా అమలవుతూ వస్తున్న విధివిధానాలే ఈ దురవస్థకు కారణమని కూడా వ్యాఖ్యానించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులోని అత్యున్నత బెంచ్ రాజ్యాంగ ధర్మాసనానికి రాసిన లేఖలో కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కొలీజియం స్థానంలో ‘నేషనల్ జ్యూడీషియల్ అపాయింట్స్ మెంట్స్ కమిషన్’ను కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సహా దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలోని రాజ్యంగ ధర్మాసనం కేంద్రం ప్రతిపాదించిన కమిషన్ ను కొట్టివేసింది. దీంతో కంగుతిన్న కేంద్రం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక విషయంలో కొన్ని నిబంధనలను పాటించాలని విన్నవిస్తూ ఓ లేఖను రాజ్యాంగ ధర్మాసనానికి రాసింది. గడచిన దశాబ్దాన్ని పరిశీలిస్తే, హైకోర్టు చీఫ్ జస్టిస్ లు మాత్రమే సుప్రీం జడ్జిలుగా పదోన్నతి పొందుతున్నారని, హైకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ప్రతిభ గల ఇతర సీనియర్ న్యాయమూర్తులను ఈ విషయంలో విస్మరిస్తున్నారని, హైకోర్టు చీఫ్ జస్టిస్ లు కానంత మాత్రాన వారి ప్రతిభను బలి చేయకూడదని ఆ లేఖలో కేంద్రం ప్రస్తావించింది. దీంతో ప్రతిభావంతులైన హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులకు, న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న న్యాయకోవిదులకు ఆ పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కారణంగానే గడచిన 65 ఏళ్లుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒక్క న్యాయకోవిదుడు కూడా ఎంపిక కాలేకపోయారని కొలీజియం వ్యవస్థను దెప్పిపొడిచింది. కేంద్రం రాసిన ఈ లేఖ దేశవ్యాప్తంగా పెను చర్చకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు.

  • Loading...

More Telugu News