: అక్రమ కలప స్వాధీనం కోసమొస్తే... ఫారెస్ట్ సిబ్బందికి చుక్కలు చూపిన గ్రామస్థులు
అడవుల్లోని టేకు చెట్లను ఇష్టారాజ్యంగా నరికేసి కలపగా మార్చిన గ్రామస్థులు అంతటితో ఆగలేదు. అక్రమ కలపను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అటవీ శాఖ సిబ్బందిపైనే దాడికి దిగారు. గ్రామస్థుల నుంచి ఊహించని విధంగా దాడి ఎదురుకావడంతో అటవీ శాఖ సిబ్బంది పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన నిన్న రాత్రి వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం అజంనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ దాడిలో అటవీ శాఖ అధికారులు రవికిరణ్, జోగిందర్ తో పాటు 15 మంది సిబ్బందికి గాయాలయ్యాయి. అటవీ శాఖ సిబ్బందిపై దాడికి దిగిన గ్రామస్థులు సిబ్బంది వాహనంపైనా ప్రతాపం చూపారు. గ్రామస్థుల దాడిలో ఫారెస్ట్ జీపు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.