: ఓరుగల్లులో జగ్గారెడ్డి... ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా
తెలంగాణ ఫైర్ బ్రాండ్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) వరంగల్ లో కాలు మోపారు. గతంలో తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున తనదైన రీతిలో పనిచేసిన జగ్గారెడ్డి, తాజాగా వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ దిగిపోయారు. కొద్దిసేపటి క్రితం ఓ తెలుగు న్యూస్ చానెల్ తో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ తరఫున మంచి వ్యక్తిగా పేరున్న సర్వే సత్యనారాయణను బరిలోకి దించామని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో అధికార టీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని, సర్వే సత్యనారాయణ విజయం ఖాయమని జగ్గారెడ్డి తెలిపారు.