: బీహార్ ఎమ్మెల్యేల్లో గెలిచిన వారిలో అత్యధికులు నేరచరితులే!
బీహార్ ప్రజలు తమ పాలకులుగా ఎవరిని ఎన్నుకున్నారో తెలుసా? ఈ ఎన్నికల్లో గెలిచిన వారిలో 59 మంది వివిధ కేసుల్లో ఇరుక్కున్న వారే. వీరిలో అత్యధికులపై కేసులు విచారణ దశలో ఉండగా, జైల్లో ఉన్నవారు కూడా గెలిచిన వారిలో ఉండటం గమనార్హం. కొందరిపై హత్యాభియోగాలు, అత్యాచార, దోపిడీ కేసులు కూడా ఉన్నాయి. విజయం సాధించిన 243 మంది ఎమ్మెల్యేలలో 59 శాతంగా, అంటే 143 మంది ఎమ్మెల్యేలపై పలు రకాల క్రిమినల్ కేసులు ఉన్నాయి. 96 మందిపై అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. 12 మందిపై హత్య కేసులు, 26 మందిపై హత్యాయత్నం కేసులు, 9 మందిపై కిడ్నాప్ కేసులు, 13 మందిపై దోపిడీ కేసులు ఉన్నాయి. ఇక పార్టీల పరంగా చూస్తే, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ 80 స్థానాలు గెలువగా, 49 మందిపై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆయన భాగస్వామి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలపై ఇవే తరహా కేసులున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 3,450 మంది పోటీపడగా, అందులో 30 శాతం మంది, అంటే 1,038పై క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీ 157 స్థానాల్లో పోటీ పడగా, 61 శాతం మందిపై, అంటే 95 మందిపై కేసులున్నాయి. వీరిలో 34 మంది విజయం సాధించారు. బీజేపీ తరఫున గెలిచిన వారిలో 18 మందిపై తీవ్రమైన కేసులు విచారణ దశలో ఉన్నాయి. మొత్తం గెలిచిన వారిలో 89 మందిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసులు నమోదై ఉన్నాయంటే, గెలిచిన వారు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుండగా, బీజేపీ నుంచి 105 మంది (157 సీట్లలో 67 శాతం), జేడీయూ నుంచి 76 మంది (101 సీట్లలో 75 శాతం), ఆర్జేడీ నుంచి 66 మంది (101 సీట్లలో 65 శాతం), కాంగ్రెస్ నుంచి 25 మంది (41 సీట్లలో 61 శాతం) కోటీశ్వరులున్నారు. వీరి ఆస్తి సరాసరిన 2.74 కోట్లు కాగా, జేడీయూ తరఫున ఖగారియా నుంచి బరిలో దిగి గెలిచిన పూనమ్ దేవీ యాదవ్ తన ఆస్తి రూ. 41.3 కోట్లని వెల్లడించారు.