: ఎస్పీ నేతగా ‘ఓటుకు నోటు’ నిందితుడు...వంద ‘గ్రేటర్’ సీట్లు తమవేనంటున్న మత్తయ్య
తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా తెలంగాణ ఏసీబీ ఆరోపిస్తున్న జెరూసలెం మత్తయ్య చాలా కాలం తర్వాత హైదరాబాదుకు వచ్చారు. మొన్నటిదాకా క్రైస్తవ సంఘాల నేతగా ఉన్న ఆయన తాజాగా రాజకీయ నేత అవతారం ఎత్తారు. ఉత్తరప్రదేశ్ లో అధికార పార్టీ సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ శాఖకు ఆయన మీడియా కో-ఆర్డినేటర్ గా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ నేత అవతారం ఎత్తగానే ఆయన నోటి నుంచి కీలక ప్రకటన కూడా వెలువడింది. సికింద్రాబాదు పరిధిలోని కంటోన్మెంట్ ఐదో వార్డులోని జ్యోతి నగర్ లో ఉన్న ఎస్పీ కార్యాలయానికి నిన్న వచ్చిన ఆయన పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షురాలు నాగలక్ష్మి సమక్షంలో కొత్త బాధ్యతలు చేపట్టారు. వెనువెంటనే ఆయన ఏకంగా మీడియా సమావేశం కూడా నిర్వహించారు. వచ్చే గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 వార్డుల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాక గ్రేటర్ లో వంద వార్డులను గెలుస్తామని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.